Search This Blog

Monday 11 August 2014

నిత్య పోరాట స్ఫూర్తి మల్లు స్వరాజ్యం..!

Mallu-Swarajyam1ఆమె ఓ పోరాటయోధురాలు, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ధీర వనిత... రజాకారుల అకృత్యాలపై మడమ తిప్పకుండా యుద్ధం సాగించిన ధైర్యవంతురాలు. యుక్తవయసులో మొదలు పెట్టిన పోరు నేడు వృద్ధాప్యం మీద పడినా ఆపని ధీరోదాత్త.కానీ అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా అప్పటి పోరాటం రజాకారులపై, ఇప్పటి పోరాటం నేటి పాలకులపై. పోరాటం తప్ప ప్రజలకు మిగిలిందేమీ లేదు అన్న వాస్తవం ఆమె మాటల్లోవిస్పష్టంగావినిపిస్తుంది.విలీనమా...విమోచనమా అంటూ రోజుకో మాటతో నాయకులు చేస్తున్న గారడీని చూస్తే వేదన కలుగుతుందంటూ ఒకింత ఆవేదన చెందుతున్న మహిళ.. నాటి నుండి నేటి వరకు వున్న సామాజిక, రాజీయ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన ఆమె వాటిపై తన అభిప్రాయాలను వివరించారు.

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా ఇప్పటికీ సగటు మహిళకు ఇక్కట్లు తప్పడం లేదన్న నిష్టూర సత్యాన్ని నొక్కి చెబుతున్నారు. రజాకారులు పోయినా నేటి పాలకులు వారి వారసులుగానే ప్రజలను పాలిస్తున్నారంటున్నారు. నేడు ఏది పొందాలన్నా పోరాటం తప్ప వేరే గత్యంతరం లేని దయనీయ స్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా సామాన్యుని వెతలు తీరే మార్గం లేదంటూ అసలు నిజాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. ఆమె ఎవరో కాదు.. నేటికీ ఎత్తిన జెండా దించకుండా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న అప్పటి తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం. ఒకవైపు రాష్ట్ర అవతరణ మరో వైపు విద్రోహం పేరిట వాగ్వాదాలు నడుస్తున్న తరుణంలో వర్తమాన, రాజకీయ, సామాజిక పరిస్థితులపై మల్లుస్వరాజ్యం ఏమంటున్నారో ఆమె మాటల్లో...

చిన్నతనంలో...
పుట్టింది 1931లో నల్గొండ సూర్యా పేట రాయనిగాపురం. భూస్వాముల కుటుంబమే. చిన్నతనం నుండి ఎన్నో కట్టుబాట్లుండేవి. అయినా మా సంబంధీకు ల్లో ఎంతో మంది గాంధీ పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వారి ఇష్టం మేరకే నాకు స్వరాజ్యం అని పేరు పెట్టారు. పదేళ్ళ వయసులో మాక్సిమ్‌ గోర్కీ రచన మదర్‌ చదివి ఎంతో ఉత్తేజం పొందాను. నన్ను నేను ఒక ఉద్యమకారిణిగా మార్చు కున్నాను.నిజాం రజాకార్‌ ఉద్యమానికి సంబంధించి విషయాలను ఎన్నో విన్నాను. దీనికి సంబంధించి ప్రజల్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో 13 ఏళ్ళ వయస్సులో ఆంధ్రమహిళా సభ ఏర్పాటు చేసిన తరువాత ఉద్యమంలోకి వచ్చాను. వారితో కలిసి బుర్రకథలు వంటి వాటిలో పాల్గొన్నాను. భూస్వాముల కుటుంబం కావడంతో మా ఇంట్లో అభ్యంతరం పెట్టేవారు. కానీ కట్టుబాట్లను ఎదరించి ఉద్యమంలోకి వచ్చాను. అనంతరం దళం కమాండర్‌గా వుండి పోరాటంలో ముందుకు నడిచాను. అప్పట్లో నన్ను పట్టుకున్న వారికి పదివేల రూపాయల బహుమానాన్ని ప్రకటించారు.

అప్పటి పరిస్థితులు... 
పశువులకన్నా హీనంగా ప్రజల్ని పరిపాలించారు. కులం తక్కువ వాళ్ళని పేదలను బానిసలుగా చేసుకునేవారు. వారి కింద తిరిగి మహిళలు అంటే బానిసల కింద బానిసలుగా మహిళలు బతికేవాళ్ళు.వండి పెట్ట డం, పని చేయడం, సాకడం వంటివన్నీ వీరే చేసేవారు. అప్పట్లో పురుషుల కన్నా మహిళల పరిస్థితి ఎంతో దారుణం. ఉన్నత కుటుంబాల్లో, ఉన్నవారి కుటుంబాల్లో వుండే మహిళల పరిస్థితి కాస్త భిన్నంగా వున్నా అందరిదీ ఒకటే పరిస్థితి. వారి బతు కు వారిది కాదు. వారి కుటుంబం వారిది కాదు. ఎవరేం చెప్పినా వినాలి. తరతరాలు గా బానిసలుగా బతుకుతున్న వాళ్ళలో పోరాటాలు ఎంతో స్ఫూర్తి నింపాయి. 

అంతటా ఉద్యమాలు... 
నేను ఉద్యమంలో పాల్గొంటున్న అప్పట్లో దేశం అం తటా ఏదో ఒక పేరుతో ఉద్యమాలు సాగుతూనే వుండేవి. ఒకవైపు కోస్తా ఆం�ధ్రాలో సంస్కరణ ఉద్యమం సాగుతోంది. కందుకూరి వీరేశలింగం పిలుపుతో వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాలను వ్యతిరేకించడం వంటివన్నీ చేసేవారు. ఇక్కడ హైదరాబాదులో నిజాం ఫ్యూడల్‌ కట్టుబాట్లకు వ్యతిరేకంగా రజాకారు ఉద్యమాలు.. అక్కడైనా.. ఇక్కడైనా ఎక్కడ పిలుపునిచ్చినా ముందుగా పేద మహిళలే ఉద్యమంలో పాల్గొనేవారు. ఎందుకంటే కట్టు బానిసలకు బానిసలుగా బతుకుతున్నది వారే. అన్ని రకాలుగా హింసకు గురౌతున్నది కూడా ముందుగా వారే.అందుే అంత చైతన్యం వుండేది.

స్వాతంత్య్రానంతరం... :
Mallu-Swarajyamస్వాతంత్య్రానంతరం, రాష్ట్రం ఏర్పడిన అనం తరం ఇలా ఏర్పడిన తరువాత అని కాకుండా అప్పుడూ..ఇప్పుడూ అంటే సరి పో తుంది. ఎందుకంటే పాలకులు మాత్రమే మారిపోయారు. ఇంకా చెప్పాలంటే స్వా తంత్య్రం వచ్చిన తరువాత ఏర్పడిన ప్రభుత్వం, పాలకులు ప్రజలకు కాస్త భయ పడే వారు. రాజ్యాంగంలోని కొన్ని నియమాలనైనా పాటించేందుకు ప్రయత్నించే వారు. మహిళలకు గౌరవం ఇచ్చేవారు. కానీ ఇప్పటి పాలకులకు ఏ మాత్రం భయం లేదు. పేదలు ఎలా పోయినా పర్వాలేదు. ఏం అయినా పర్వాలేదు. ముందుగా వారి పదవి ముఖ్యం. తరువాత పెట్టుబడిదారులు ముఖ్యం. 

ఆ తరువాత ఏవరైనా.. అప్పటికి ఇక ఏమీ మిగలదు కదా..? ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తాను. నేను కేవలం 25 వేల ఖర్చుతో అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పుడు అది సాధ్యం కాదు.దండలకు కూడా ఒక్కొక్కరు రూపాయి రూపాయి పోగు చేసుకుని కొన్నారు. ప్రచారానికి కూడా పెద్దగా ఏమీ ఖర్చులు పెట్టలేదు. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఎవరూ గెలవరు. ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి. మన పాలకుల పాలనకు సంబంధించి.

పోరాటాల వల్ల సాధించినవి... 
ప్రస్తుతం ఏవైనా కొంచెం మేలు జరిగిందంటే అది పోరాటాల వల్ల సాధించుకున్నదే. నిర్సంగ్‌ స్కూళ్ళు, ఇళ్ళస్థలాలకు ఆడ వారిపేరు, రిజర్వేషన్లు, ఆస్థిహక్కు ఇవన్నీ ఎప్పటినుండో పోరాడుతుంటే వచ్చినవే..ఇంకా పోరాడాలి. రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికీ ఇక్కడ సరైన న్యాయం దక్కడం లేదు. 

నాకన్నా గొప్ప నాయకురాళ్ళు ఎందరో... 
అప్పట్లో ఒక్క పోరాటం అని కాకుండా ఎంతో మంది నాయకురాళ్ళు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి పోరాటాల్లోకి వచ్చారు. కటుంబాలను వదులుకున్నారు. కేవలం అభ్యున్నతే లక్ష్యంగా వుండేవారు. వారిలో మోటారి ఉదయం, అల్లూరి మన్మోహిని, రాజేశ్వరమ్మ, ఆనిగళ్ళ అన్నపూ ర్ణమ్మ, పుతుంబాక భారతి, మాదిగొండ సూర్యావల్లి, సీతాకుమారి ఇంకా ఎంతో మంది వున్నారు. వీరిలో కొందరు ఇప్పుడులేరు.కొందరు వున్నా వయసు భారం వల్ల ఉద్యమాల్లో పాల్గొనడం లేదు. కానీ ఈ సందర్భంగా వీరందరినీ గుర్తు చేసు కున్నందుకు ఎంతో సంతోషంగా వుంది.

మహిళలకు సందేశం... :
ఒక్కటే సందేశం. పోరాడాలి. కావలసినవి సాధించుకోవాలి. చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం 30 ఏళ్ళుగా పోరాడుతున్నా ఇప్ప టికీ ఆమోదం దొరకడం లేదు. ఒకప్పుడు మగవాడు పోషించేవాడు, భరించేవాడు, రక్షించేవాడు కానీ ఇప్పుడూ మహిళలే పోషించాలి, రక్షించాలి, భరించాలి. అన్నీ మహిళలే చేయాలి.కట్నం తీసుకుని రా.. నువ్వు తిను నాకు పెట్టు అంటున్న మగ వారి ధోరణిలో మార్పు తీసుకురావాలి.మహిళలూ మనుషులే అని తెలియ జేయాలి. హక్కులు సాధించుకోవాలి.

ఇప్పటి స్వరాజ్యం వయసు 78... ఆమె పోరాటాల వయసు 65... ఇంకా ఆమెలో పోరాట స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు. ''చేసేది ఇంకా వుంది. పోరాటాలు మాత్రమే మహిళలను ముందుకు నడిపిస్తాయి. ఇంతకాలం పోరాటాలు చేసినా సాధించినవి చాలా తక్కువ. ఇకమీదటే అన్నీ చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. అందరినీ ఉద్యమంలోకి నడిపించాలి. ప్రస్తుతం మద్యం, మైక్రోఫైనాన్స్‌కి సంబంధించి పోరాటాలు చేస్తున్నాం. ఇంకా పోరాడాల్సినవి చాలానే వున్నాయి. అందుకు ప్రతిక్షణం పోరాడాలి'' అంటూ ఆమె తన బాధ్యతలను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. అందుకు చురుగ్గా ఆలోచిస్తున్నారు. ఆమె పోరాట పటిమ మరింతగా పెరగాలని ఆశిద్దాం. ఈ పోరాటంలో విజయాలు సాధించాలని కోరుకుందాం.

ఉద్యమంలోనే వివాహం...
తోటి ఉద్యమకారుడు మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకున్నాను. ఇద్దరం కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాను. చాలా కాలం అడవులలోనే గడిపాం. అన్నిటికీ వెన్నుతట్టి ప్రోత్సహించేవారు.సమకాలీన పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరించేవారు. అన్నిటికీ ముందుండేవారు. మా కుటుంబ సభ్యులు అన్న, అక్క శశిరేఖ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. తుపాకులు చేతబట్టి ముందుకు వచ్చేవారు. వారిని చూసినప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకు నడవడానికి శక్తి వచ్చినట్లు అనిపిస్తుండేది.
 - హైమ సింగతల,
 surya telugu daily  October 31, 2010

No comments:

Post a Comment