Search This Blog

Wednesday 20 August 2014

తొలి ‘ఓటు’ రోలా దస్తి...

కువైట్‌లో మొట్టమొదటి మహిళా ఓటరుగా నమోదుచేసుకున్న రోలా దస్తి. కేవలం ఓటు హక్కే కాదు.. మొదటి ఉద్యోగిని.. అణగదొక్కబడుతున్న స్ర్తీ జాతికి సమానత్వం, సమాజంలో స్థానం కల్పించాలని కోరిన స్త్రీ మూర్తి. మహిళలందరికీ స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన మహిళ...

2005లో కువైట్‌లో మొట్టమొదటి సారి ఓటు హక్కు పొందిన మహిళ రోలా దస్త్తి. మహిళలకు కూడా ఓటు హక్కు ఇవ్వాలంటూ ఆమె చేసిన సుదీర్ఘ పోరాట ఫలితం అది. కువైట్‌ పార్లమెంటు ఎన్నికలలో మొదటి సారి మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్న సంవత్సరం అది. 2006లో పార్లమెంటు ఎన్నికల పోటీలో అభ్యర్థిగా నిలబడిన మొదటి మహిళ కూడా రోలానే. ఆమె చేసిన పోరాటాల ఫలితమే 2009 పార్లమెంటు ఎన్నికలలో ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు సీట్లను సంపాదించుకున్నారు.కువైట్‌ పార్లమెంటులో అడుగుపెట్టిన మొదటి మహిళ కూడా రోలానే. 

రోలా జాన్స్‌ హాకిన్స్‌ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్‌లో పిహెచ్‌డి విద్య పూర్తి చేసింది. దేశంలో ఆర్థిక స్థితిగతులు, సమాజిక పరిస్థితుల అంశాలపై ఆమె పరిశోధనలు చేసింది. మొదట ఆర్‌అండ్‌డి విద్యా సంస్థ కువైట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో మేనేజర్‌గా, నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కువౌట్‌కు సీనియర్‌ ఎకనామిస్ట్‌గా, వరల్డ్‌ బ్యాంక్‌కు సంబంధించిన ఓ కన్సల్టెన్సీ బాధ్యతలు కూడా ఆమె నిర్వహించింది.1990, 91లలో ప్రభుత్వ ఎమర్సెనీ సమయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. కువైట్‌ ఎకనామిక్‌ సొసౌటీకి చైన్‌ పర్సన్‌గా కూడా ఎంపికైంది. 

ఇలా ఎంపికైన మొదటి మహిళ ఆమె. ఆమె గ్రాడ్యుయేషన్‌ విద్యనభ్యసిస్తున్నప్పటి నుండి అనేక స్వచ్చంద సంస్థల్లో వాలెంటరీగా పని చేసింది. రిపబ్లిక్‌ యెమెన్‌లో మహిళలకు సంబంధించి ఆర్థిక స్వేచ్ఛ కోసం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించింది. కువైట్‌లో మహిళా సమానత్వం కోసం పోరాడింది. 2005 మేలో మహిళలు ఓటు వేసేందుకు అనువుగా డిక్రీని తీసు కొచ్చింది. ఇందుకు ఆమె ‘కింగ్‌ హుస్సేన్‌ హ్యుమానిటేరియన్‌’ అవార్డును అందుకుంది. రెడ్‌ క్రాస్‌ సొసైటీలో సభ్యురాలిగా సేవ చేసింది. 

ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సంస్కరణల అమలుకు ఆమె ఎంతగానో కృషి చేసింది. వీటికి సంబంధించి కృషి చేస్తున్న ఎన్నో స్వచ్చంద సంస్థలను ప్రోత్సహించింది. అరబ్‌ దేశాల్లో వంద మంది ప్రభావశీల మహిళల్లో స్థానం సంపాదించుకుంది. 1970లో ఏర్పడిన కువైట్‌ ఎకనామిక్‌ సొసైటీలో స్థానం సంపాదించుకున్న మొట్టమొదటి మహిళగా రోలా చరిత్రలోకెక్కింది. రోలా అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీని కూడా నిర్వహించింది. యంగ్‌ అరబ్‌ లీడర్స్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలిగా పనిచేసింది. మహిళా ఆర్గనైజేషన్‌ను స్థాపించింది. 2009లో పార్లమెంటరీ ఎన్నికలలో గెలిచి తన జిల్లాలో ఏడవ స్థానంలో నిలిచింది. 2010లో ఆమె కౌన్సిల్‌ ఆఫ్‌ యూరోప్‌ నుండి సౌత్‌ నార్త్‌ బహుమతిని అందుకుంది.
-హైమ సింగతల
సూర్య దినపత్రిక, ధీర

No comments:

Post a Comment